Atrocities at Vijayawada Pushkara Ghat Due to lack of Police Surveillance:కృష్ణా నదిలోని ఇసుక తిన్నెలు అరాచక శక్తులకు నెలవుగా మారాయి. నదికి రెండు వైపుల ఉన్న ఘాట్లు పోకిరీలకు అడ్డాలుగా మారాయి. విజయవాడ నగరవాసులు ఆహ్లాదం కోసం పుష్కర ఘాట్, ప్రకాశం బ్యారేజి వద్దకు వెళ్తుంటారు. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఘాట్లను భారీగా విస్తరించారు. వీటిని బ్లేడు బ్యాచ్, గంజాయి ముఠా, తాగుబోతులు, అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటోంది. ప్రశాంతత కోసం సాయంత్రం పూట వచ్చే వారిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారు. అన్ని చోట్లా అడుగడుగునా మద్యం సీసాలే దర్శనమిస్తుంటాయి. నిఘా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఆడుకుంటూ వెళ్లిన బాలుడు అదృశ్యం - తెల్లవారేలోగా డ్రైనేజీలో తేలిన మృతదేహం
ఒంటరిగా ఉన్న వారే లక్ష్యంగా దాడులు..పున్నమి, భవానీ, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో కెమెరాలు లేవు. పున్నమి ఘాట్‌లో ఉన్న అరకొర సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీనికి తోడు చాలా చోట్ల ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన హైమాస్ట్ దీపాలు వెలగడం లేదు. వీటిని సరిచేయకపోవడంతో ఘాట్లలో అంధకారం నెలకొంటోంది. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు ఉన్నాయి. వీటి వద్దకు విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి బ్లేడ్, గంజాయి ముఠాలు సాయంత్రానికి ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తుంటాయి. అక్కడే మద్యం తాగుతుంటారు, గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తుంటారు. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి. పోలీసుల వస్తే నదిలోకి పరారవుతారు. వీరు సాధారణంగా గుంపుపై దాడి చేయరు. ఒకరు, జంటగా వెళ్తూ కనిపిస్తే డబ్బు కోసం డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయాలు చేస్తారు. జేబులోని డబ్బు, ఫోన్లను తీసుకుని పరారవుతారు.