Assets Sales in Vishaka : గత సంవత్సరం కంటే 2022-23సంవత్సరంలో రాష్ట్రం మొత్తంలో రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 9.85 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వానికి 2021-22లో రిజిస్ట్రేషన్ల ద్వారా 7వేల 347 కోట్లు ఆదాయం రాగా.. 2022-23లో 8 వేల71 కోట్ల రూపాయలు వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా ఆదాయపరంగా -4.69శాతం వెనకబడింది. విశాఖ జిల్లాలో మాత్రం 2.84శాతం వృద్ధి నమోదైంది. విజయనగరం జిల్లాలో 2021-22లో కన్నా 2022-23లో -6.16శాతం తగ్గింది. గుంటూరులో 17.48శాతం, పల్నాడులో 24.95శాతం, బాపట్లలో 18.44శాతం, ఎన్టీఆర్‌లో 25.86శాతం చొప్పున ఆదాయం పెరిగింది. పేదల గృహవసతి కోసం మొత్తం విస్తీర్ణంలో 5 శాతం స్థలాన్ని.. కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి అప్పగించాలన్న నిబంధనను జనవరిలో ప్రభుత్వం ఉపసంహరించుకున్నా.. ఆదాయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. అలాగే 2021-22 మార్చి నెలలో వెయ్యి66 కోట్ల ఆదాయం రాగా.. 2022-23 మార్చిలో 950 కోట్లు మాత్రమే వచ్చింది.
ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల 5 వేల177 దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఓటీఎస్ కింద జరిగిన రిజిస్ట్రేషన్లూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా తర్వాత నరసరావుపేట, నెల్లూరు జిల్లాల్లో 24.95శాతం, 24.70శాతం చొప్పున అత్యధికంగా ఆదాయం వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది.