ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగిన ఎన్టీఆర్ జిల్లా ఆశా వర్కర్ల సంఘం ASHA WORKERS PROTEST : ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఏపీ ఆశా వర్కర్స్ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు కమల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వం ఆశా వర్కర్ల నియామకం చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఆశావర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు అనే సాకుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశా వర్కర్ల కుటుంబాలకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు బటన్ నొక్కడం తెలుసు :ఆశావర్కర్ల నియామకంలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఆశావర్కర్లు కరోనా బారిన పడిన వారికి సేవలందించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆశా వర్కర్లకు అనేక హామీలు ఇచ్చారని వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే 2024 ఎన్నికల్లో తమకు కూడా బటన్ నొక్కడం తెలుసని.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు.
విశాఖలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన : కనీస వేతనాలు చెల్లించాలంటూ విశాఖలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వం తమకు పది వేల రూపాయలు జీతాలుగా చెల్లించి పని భారాన్ని పెంచిందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క సచివాలయాల్లో పని చేయడంతో పాటు స్థానిక పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో కూడా పని చేయిస్తున్నారని తెలిపారు. తమకు టైం చార్ట్ ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఉన్నతాధికారులు స్పందించడం లేదని వాపోయారు.
అసెంబ్లీ ముట్టడి :తమకు ఇచ్చిన 10 వేల రూపాయల గౌరవ వేతనంతో తమను కూడా ప్రభుత్వ అధికారులుగా పరిగణిస్తూ ప్రభుత్వ పథకాలు కూడా దక్కకుండా చేస్తున్నారని స్పష్టం చేశారు. తమ విధి విధానాలు స్పష్టం చేయాలని కోరుతూ విశాఖలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించే బిల్లును పాస్ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటామని హెచ్చరించారు.
సమస్యల పరిష్కరించాలని కోరుతూ ధర్నా :బాపట్ల పట్టణంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల నందు డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట జిల్లా స్థాయి ఆశా వర్కర్లు వారి యొక్క సమస్యల పట్ల నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని వారి యొక్క సమస్యలను ఉన్నత అధికారులకు తెలిసేలా నిరసన కార్యక్రమం చేపట్టారు.
మాపై రాజకీయ జోక్యం ఉండకూడదు :ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యురాలు మాట్లాడుతూ వారి డిమాండ్లను తెలియజేశారు. వారి డిమాండ్లు ప్రభుత్వం కనీస వేతనాన్ని తమకు అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని తమకు సంబంధం లేని పనులను సంబంధిత అధికారులు చేయించకూడదని, అక్రమ తొలగింపులు రాజకీయ జోక్యం తమపై ఉండకూడదని, విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేయాలని వారు కోరారు.
మాట వినకపోతే బెదిరిస్తున్నారు :ఆశా వర్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఆద్వర్యంలో ధర్నా చేసారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు నగరంలోని మునుమూడు బస్టాండ్ సెంటర్ నుండి ప్రదర్శన చేసారు. జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు సంబంధం లేని పనులు కూడా తమ చేత చేయించుకుంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. మాట వినకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. దీని మీద జిల్లా వైద్యాధికారి స్పందించాలని లేనిపక్షంలో సమస్య పరిష్కరించే వరకు కార్యాలయం ముందు బైఠాయిస్తామని తెలిపారు. జిల్లా వైద్య శాఖ అధికారి ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల దగ్గరికి వచ్చి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఇవీ చదవండి