APSRTC EMPLOYEES: ఏపీఎస్ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2020 జనవరి 1 నుంచి వీరందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులని వాళ్లకు ట్యాగ్ వేశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రయోజనాలేవీ కల్పించలేదనే అసహనం సిబ్బందిలో కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2022 నుంచి 11వ పీఆర్‌సీని అమలు చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి మాత్రం సెప్టెంబర్ 2022 నుంచి అమలు చేసింది.
కానీ జూన్, జూలై, ఆగస్టు నెలల బకాయిల చెల్లింపుల సంగతేంటని అడిగితే చెప్పేవారేలేరు. ఆర్టీసీ కార్మికులుగా ఉన్నన్నాళ్లు ఉద్యోగులు అదనపు పనిగంటలు పనిచేస్తే వారికి వివిధ రకాల అలవెన్సులు ఇచ్చేవారు. విలీనం తర్వాత గతేడాది ఆగస్టు నుంచి ఓవర్ టైం, అలవెన్సులను ప్రభుత్వం నిలిపివేసిందని ఇస్తారో లేదో స్పష్టత లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కార్పేరేషన్‌లో ఉండగా ఏటా ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ ఉండేది. విలీనం తర్వాత అదీ ఆపేశారు. 2020-21 ఏడాదికి సంబంధించి ఉద్యోగులు దరఖాస్తు చేసి ఏడాది గడిచినా లీవులు మినయించారు తప్ప డబ్బు చెల్లించలేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. వీటన్నంటిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను నేరుగా కలిసినా, సీఎం జగన్‌కు లేఖలు రాసినా స్పష్టత లేదని సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు.