ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఏపీఎస్‌ఆర్టీసీ.. అధికార వైకాపా సేవలో తరిస్తోంది. ఆ పార్టీ అడిగిందే తడవుగా వందల బస్సులను కేటాయించి ప్రయాణికులను రోడ్డుపాలు చేసింది. మిగిలిన బస్సులతోనే మీ పాట్లు మీరు పడండి అనేలా వదిలేసింది. పోనీ బస్సులు తగినంత ఉండవని ముందుగా చెప్పే ప్రయత్నమూ చేయలేదు. అసలే సంస్థలో ప్రస్తుతం అత్యధికంగా డొక్కు బస్సులుంటే, కొన్నింటి కండిషనే బాగుంది. ఇలా బాగున్న బస్సులన్నీ సదస్సులకు పంపేసి.. కాలం చెల్లిన డొక్కు బస్సులను ప్రయాణికులకు వదిలేశారు. జులైలో జరిగిన వైకాపా ప్లీనరీకి 2,200 బస్సులు పంపించి తమ స్వామి భక్తిని చాటుకున్న ఆర్టీసీ యాజమాన్యం.. తాజాగా విజయవాడలో బుధవారం నాటి జయహో బీసీ సభకు 1,630 బస్సులు పంపించి విధేయతను చూపించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో బస్సులు లేక ప్రయాణికులు మంగళవారం నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజులు పార్టీ సేవలో.. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కలిపి 500, రాయలసీమలో 400-500 బస్సులు మంగళవారం నుంచి మూడు రోజులపాటు అందుబాటులో ఉండట్లేదు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వెళ్లిన బస్సులు గురువారం వరకు అందుబాటులోకి రావు.
15 శాతం బస్సులు బీసీల సభకే:ఆర్టీసీలో 11,214 బస్సులు ఉండగా.. వీటిలో నిత్యం 10,374 బస్సులు వివిధ మార్గాల్లో తిరుగుతుంటాయి. ఇందులో 1,630 బస్సులను వైకాపా బీసీ సభకు పంపడంతో.. నిత్యం తిరిగే బస్సుల్లో 15% అటే వెళ్లిపోయినట్లు అయింది. వెళ్లినవాటిలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ బీసీ సభకు వెళ్లడంతో మూడు రోజులపాటు ఆయా ట్రిప్పులు అన్నీ రద్దయినట్లే అయింది.