Panchayat Raj ENC CV Subbareddy: రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) నియామకంలో ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లకు మరోసారి అన్యాయం జరిగింది. సీనియారిటీ ప్రకారం ఈఎన్‌సీ స్థానానికి అర్హులను పక్కన పెట్టి... జాబితాలో ఐదో వ్యక్తిని ఈఎన్‌సీ స్థానంలో కూర్చోబెట్టి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించడం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
2021 మే 31న చీఫ్ ఇంజినీర్‌గా పదవీవిరమణ చేసిన బి.సుబ్బారెడ్డికి ఈఎన్‌సీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన కంటే సీనియర్లయిన ఎస్సీ, ఎస్టీ ఇంజినీర్లు ఇప్పటికే నష్టపోయారు. సుబ్బారెడ్డి పదవీకాలాన్ని రెండు విడతల్లో ఏడాదిన్నర పాటు ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఇన్నాళ్లూ కొందరు సీఈలుగానే ఉద్యోగ విరమణ చేశారు.