APJAC Malidasha movement start in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జేఎసీ అమరావతి తన మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల డిమాండ్లను, సకాలంలో జీతాలు చెల్లించాలంటూ నిరసన కార్యక్రమాలను షురూ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలోని ప్రధాన కూడల్లో పోస్టర్లను విడుదల చేసింది (ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన పోస్టర్లు). ఈ నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొంటున్నారని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
26 జిల్లాల్లో పోస్టర్లు విడుదల... రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు శనివారు నిరసన దీక్ష మొదలుపెట్టారు. నల్ల కండువాలను ధరించి, ప్లకార్డులతో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. 11 పీఆర్సీ ప్రతిపాదిత స్కైల్ అమలు చేయాలని కోరారు. పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమయానికి ఉద్యోగులుకు జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు.
మలిదశ కార్యాచరణ ప్రారంభం:అనంతరం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలను బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏప్రిల్ 17వ తేదీన, 20వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి.. మద్దతు కోరతామని బొప్పరాజు వేంకటేశ్వర్లు తెలిపారు. ఏప్రిల్ 21న సెల్‌డౌన్ యథావిథిగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఈనెల 27న కారుణ్య నియామకాలకు సంబంధించిన కుటుంబాల సభ్యులను కలిసే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. మే నెల 5వ తారీఖున మరోసారి సమావేశం ఏర్పాటు చేసి.. ఈ నెల రోజుల అంశాలను మరోసారి చర్చించి.. కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఏప్రిల్‌లో చేపట్టే కార్యక్రమాలు ఇవే:అంతేకాకుండా మలిదశ ఉద్యమంలో ఈనెల 10వ తేదీన (గ్రీవెన్స్ డే) స్పందన కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాన్ని సమర్పించనున్నామని.. బొప్పరాజు తెలిపారు. ఏప్రిల్ నెలలో.. 11న సెల్‌డౌన్ కార్యక్రమం, 12న 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం, 15న విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం, 18వ తేదీన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపట్టే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
కర్నూలు జిల్లాలో..కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.