government employees go on mass hunger strike: ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏపీజేఎసీ అమరావతి ఉద్యోగ సంఘాలు సామూహిక నిరహారదీక్షలు చేపట్టాయి. 83 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీకి... నేటికీ అతీగతీ లేదని మండిపడ్డారు. ఉద్యమం ఆగాలంటే ఉద్యోగులు ఇచ్చిన 50 డిమాండ్లను పరిష్కరించడం తప్ప, ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
పీఆర్సీ, ఇతర బకాయిలను ఇంకెప్పుడు చెల్లిస్తారు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం తీవ్రస్థాయిలో రూపాంతరం చెందకముందే.. ప్రభుత్వం స్పందించాలని ఏపీజేఎసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు తాము రోడ్డెక్కాల్సి వస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలంటూ దశల వారీగా... ఏపీజేఎసీ అమరావతి సంఘం ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన సామూహిక నిరాహార దీక్షకు బొప్పరాజు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కానీ, ఇప్పటికీ ప్రభుత్వానికి ఆ వారం రాలేదా... అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కేంద్రం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయలేదని, పీఆర్సీ, ఇతర బకాయిలను ఇంకెప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఏలకు ఇప్పటికీ దిక్కు లేదని బొప్పరాజు ఆక్షేపించారు.
ఉద్యోగులకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు