Employee unions: రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కానీ, పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, వారు దాచుకున్న సొమ్మే ప్రభుత్వం వాడేసుకోడం ఏమిటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఆస్కార్ రావు వెల్లడించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను తీసుకు వస్తానని చెప్పారని గుర్తు చేశారు. సీపీఎస్, ఓపీఎస్ కాకుండా ఇప్పుడు జీపీఎస్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
22 నుంచి కార్యాచరణ: హామీల అమలు కోసం దశల వారీ ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు ఇచ్చిందని జి.ఆస్కార్ రావు అన్నారు. ఈ నెల 22 నుంచి కార్యాచరణ మొదలు అవుతుందని ఆస్కార్ రావు తెలిపారు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపు ఇచ్చామని ఆయన వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోపాటుగా... వివిధ శాఖల ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో పాలుపంచుకుంటారని ఆయన వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు బదిలీలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇక సమ్మెకు దిగడం మినహా తమకు మరో గత్యంతరం కనిపించడం లేదని అస్కార్ రావు అన్నారు. మే 22 నుంచి ప్రభుత్వ ఉద్యోగులంతా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు.