Discoms Annual Income Requirements Report : వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంలు చూపిన విద్యుత్ కొనుగోళ్ల లెక్కలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సందేహాలు వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో ఒక్క యూనిట్ విద్యుత్ కొనకుండా డిమాండ్‌ను సర్దుబాటు చేయడం ఎలా సాధ్యమని డిస్కంలను ప్రశ్నించింది. ఈ లెక్కల ఆధారంగా 2023-24 టారిఫ్‌ను నిర్దేశించడం సాధ్యం కాదని పేర్కొంది. లెక్కలను పరిశీలించి మళ్లీ ప్రతిపాదన దాఖలు చేయాలని ఆదేశించింది. అందుబాటులో ఉన్న విద్యుత్ వివరాలు.. బహిరంగ మార్కెట్‌లో కొనాల్సిన మొత్తం లెక్కలతో కొత్త ప్రతిపాదనలను పంపుతామని ఓ అధికారి తెలిపారు.
ఏఆర్‌ఆర్‌లో ఏం పేర్కొన్నాయంటే : వచ్చే ఆర్థిక సంత్సరంలో ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 7 వేల 684 మిలియన్ యూనిట్లు, జాయింట్ సెక్టార్ ద్వారా 4,960 ఎంయూలు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ నుంచి 4 వేల 674 ఎంయూల అదనపు విద్యుత్ అందుతుందని డిస్కంల అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 76 వేల మిలియన్ యూనిట్లు అవసరమని డిస్కంలు గుర్తించాయి. 2023-24లో వివిధ ఉత్పత్తి వనరుల ద్వారా సుమారు 89 వేల ఎంయూలు అందుబాటులో ఉంటుందని.. రాష్ట్ర అవసరాలకు ఇది సరిపోతుందని లెక్కలు చూపాయి.