Ward Sachivalayam Employees in AP: సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే వైకాపా సర్కారుపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతుండగా.. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం పదోన్నతులు, బకాయిల కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా పరిగణించడం తగదంటున్నారు.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాల విషయంలో న్యాయం చేయాలని అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి కాగానే వెంటనే ఖరారు చేయకుండా.. నిబంధనలకు విరుద్ధంగా 9 నెలలు ఆలస్యం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. రెండో నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 17 వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఐదు నెలలు ఆలస్యంగా ప్రొబేషన్ ఇవ్వడం వల్ల తమకు రావాల్సిన 5 నెలల బకాయిలు అందించాలని వారు కోరుతున్నారు. న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల విషయంలో అన్నివిధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన్యం ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏజెన్సీ అలెవెన్సులు వర్తిస్తుండగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం అవేమీ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పదోన్నతుల విధానాన్ని రూపొందించి, వాటిని సంబంధిత సర్వీస్ రూల్స్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.