Gunadala Railway Flyover constructed immediately: విజయవాడలోని గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబు రావు డిమాండ్ చేశారు. విజయవాడలోని గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నేడు నిరసన కారక్రమాన్ని చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ.. 'ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు-గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఉన్నతాధికారులు స్పందించకపోతే.. ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. 2009వ సంవత్సరంలో రూ.36 కోట్ల రూపాయలతో గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. ఆనాటి నుంచి నేటివరకు బ్రిడ్డ్ పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఐదేండ్లకొకసారి ముఖ్యమంత్రులు మారుతున్నారే తప్పా.. గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ను మాత్రం పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైల్వే ట్రాక్ మీద నుంచే ప్రజలు తమ రాకపోకలను సాగిస్తున్నారని గుర్తు చేశారు.
రైలు గేటు వేసి ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, వాహనదారులు గేటును దాటి ప్రయాణాలు చేస్తున్నారని.. బాబు రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. గుణదల రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభించకపోవడం అన్యాయమన్నారు. గూడ్స్ రైళ్లు వస్తే మండుటెండలో సుమారు అరగంట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటమేంటని ఆయన ప్రశ్నించారు.