AP Man Died In America : దేశం కానీ దేశం.. తన మిత్రుడు వస్తున్నాడనే సంతోషం.. ఆ వ్యక్తిలో ఎంతోసేపు నిలవలేదు. భారత్ నుంచి ఆమెరికా వస్తున్న తన మిత్రుడి కోసం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మార్చి 28వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కోళ్లగా ఆమెరికా పోలీసులు తెలిపారు. ఆతను అమెరికాలో డేటా అనలిస్ట్‌గా టకెడ ఫార్మాస్యూటికల్ సంస్థలో పని చేస్తున్నారు.
భారత్ నుంచి తన మిత్రుడైన ఓ సంగీత వాయిద్య కళాకారుడు అమెరికా వస్తున్నాడని.. అతనిని పికప్ చేసుకోవటానికి విశ్వచంద్ విమానాశ్రయానికి వెళ్లాడు. తన సొంత వాహనంలో విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయం బయట వేచిచూస్తున్న సమయంలో.. అతని వైపుగా వచ్చిన ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన వాహనం.. అతని వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమీపంలోనే ఉన్న ఓ నర్సు ఘటనను గమనించింది. వెంటనే స్పందించి విశ్వచంద్‌ను కారు నుంచి బయటకు తీసి పరీక్షించగా.. అప్పటికే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందినదిగా గుర్తించారు. అక్కడున్న స్థానికులు డార్ట్‌మౌత్ వాహనాన్ని నడిపిన మహిళా డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న మస్సాచుసెట్స్ పోలీసులు మహిళా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.