ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP PanchayatRaj విద్యుత్ బకాయిలు తీసేసుకుంటారా..! అయితే, స్తంభాలకు పన్ను కట్టండి..! సర్పంచుల తీర్మానం - డిస్కం

AP PanchayatRaj Chamber Meeting Resolutions: డిస్కంలకు కరెంటు స్తంభాలపై పన్ను విధించాలని సర్పంచులు నిర్ణయించారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేశారు.

AP PanchayatRaj
AP PanchayatRaj

By

Published : Jul 15, 2023, 12:49 PM IST

Updated : Jul 15, 2023, 1:19 PM IST

AP PanchayatRaj Chamber Meeting Resolutions: ప్రభుత్వ అనుమతితో కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు జమ చేసుకుంటున్న పంపిణీ సంస్థల(డిస్కం)కు కరెంటు స్తంభాలపై పన్ను విధించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచులు నిర్ణయించారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. శుక్రవారంతో సమావేశాలు ముగియగా.. వివరాలను ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ మీడియాకు తెలిపారు.

వ్యాపార సంస్థలైన డిస్కంల విషయంలో తాము కూడా పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంచాయతీల్లో తీర్మానం చేసి విద్యుత్తు స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు పన్ను విధించి.. వాటిని చెల్లించాలని నోటీసులు ఇస్తామని వెల్లడించారు. పంచాయతీల నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిలను ముక్కుపిండి వసూలు చేస్తున్నప్పుడు.. డిస్కంలు కూడా గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు వేసి వ్యాపారం చేస్తున్నందున పన్ను చెల్లించాల్సిందే అని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

17న ఎస్పీలకు ఫిర్యాదులు: పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను దొంగిలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న అన్ని జిల్లాల్లో ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీల ఖాతాల్లోని నిధులను సర్పంచుల అనుమతి లేకుండా తీసుకోవడాన్ని దొంగతనంగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వమైనా, సైబర్‌ నేరగాళ్లు అయినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీలను కోరతామని స్పష్టం చేశారు. 20న పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. 12 డిమాండ్లతో తీర్మానం ఆమోదించి ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి జగన్​, కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రికి పంపుతామన్నారు. 24న స్పందన కార్యక్రమానికి వెళ్లి దీనిపై వినతులు కూడా ఇస్తామన్నారు. ఆగస్టు 10లోగా 'చలో దిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంటు ముందు ధర్నా చేస్తాం అని వైవీబీ రాజేంద్రప్రసాద్​ వివరించారు.

త్వరలోనే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం: కేంద్ర ఆర్థిక సంఘ నిధుల మళ్లింపునకు కారణమైన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పంచాయతీలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఇళ్లను త్వరలో ముట్టడిస్తామని వైవీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పోలీసులు అప్రమత్తమై సర్పంచులను అదుపులోకి తీసుకుంటున్నందున.. ముందుగా తేదీలను ప్రకటించడం లేదని పేర్కొన్నారు. అలాగే నిధులు, అధికారాలు కల్పించే వరకు పోరాటం ఆగదని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ తదితరులు మాట్లాడారు.

Last Updated : Jul 15, 2023, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details