Counseling process in higher education: విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఎకడమిక్ క్యాలెండర్ ఇస్తున్నా... పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలను సకాలంలో పూర్తిచేయడంలేదు. ఆగస్టు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఐసెట్, పీజీ(PG).సెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈ సెట్, పీజీఈ.సెట్, ఆర్-సెట్ వంటి పరీక్షలు పూర్తికాలేదు. ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్‌లో.. గేట్, జీ-ప్యాట్ వారికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారికి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. ఉన్నత విద్యపై సీఎం జగన్, ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రకటనలకు.. వారి చేతలకు పొంతనే కుదరడం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయి.
'విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలిసిన అవసంరం ఉంది. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే తదనుగుణంగా విద్యావ్యవస్థలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టడంతో.. విద్యార్థులను గ్లొబల్ లీడర్స్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేయాల్సిన అవసం మనపై ఉంది. భయటి ప్రపంచంతో పోటి పడాలంటే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సాధ్యం అవుతుంది.'- సీఎం జగన్
ఉన్నత విద్యపై సీఎం జగన్ చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలివి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పరిస్థితి అసలేం బాగాలేనట్లు మాట్లాడిన ఆయన... విద్యార్థుల భవిష్యత్తు గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఆచరణలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను సైతం ఉన్నత విద్యామండలి సకాలంలో నిర్వహించలేకపోతోంది. దీంతో విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల.. విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. పీజీ కోర్సుల్లో చేరేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. ఉన్నత విద్యలో ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రపంచస్థాయి ప్రమాణాలంటూ మాట్లాడే సీఎం జగన్... రాష్ట్రంలో ప్రవేశాలనే సకాలంలో చేయలేకపోతున్నారు. ఆగస్టు నెల వచ్చినా ఇప్పటి వరకు ప్రవేశాల కౌన్సెలింగే మొదలవలేదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికే... విశ్వవిద్యాలయాలు ఆపసోపాలు పడుతున్నాయి.