AP High Court on Ayesha Meera Murder Case: ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ ఎస్పీలకు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు శంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తె హత్య కేసును తాజాగా విచారణ జరపాలని, విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో ఈ కేసుకు చెందించిన వస్తుసంబంధ సాక్ష్యాధారాలు(మెటీరియల్ ఆబ్జెక్ట్స్-ఎంవో) ధ్వంసం చేయడం వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ సీబీఐని ఆదేశిస్తూ 2018 నవంబర్ 29న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
Ayesha Meera Case: తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ
పిటిషనర్ల తరఫు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసులు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించి ఐదేళ్లు గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని తెలిపారు. సీబీఐ దర్యాప్తు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దర్యాప్తుపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. విచారణ నిమిత్తం తాము తాజాగా నోటీసులు ఇస్తే దానిని సవాలు చేస్తూ సత్యంబాబు తరఫున ఇదే న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారని గుర్తుచేశారు.