High Court Hearing APGEA Petition : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఏపీ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఉద్యోగులను ఆహ్వానించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఉద్యోగుల సమస్యలపై నిర్వహించే సమావేశాలకు ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులు సమస్యలపై పోరాటం :ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించటం లేదని, పెన్షన్లు సమయానికి అందించటం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాటం చేస్తోంది.