AP High Court Serious : విచారణకు గైర్హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు, విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే రెండు సార్లు కోర్టు ముందు హాజరయ్యారని ఆయన కన్నా డీఆర్‌ఏం గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. గత విచారణలోనూ డీఆర్‌ఎం హాజరు కావాల్సి ఉండగా ఆయన స్థానంలో ఓ ఇంజనీర్‌ను పంపించారని గుర్తు చేసింది. రేపు తాపీ మేస్త్రీని పంపేందుకు వెనుకాడరని మండిపడింది. డీఆర్‌ఎం స్థాయి అధికారి కోర్టుకు రప్పించలేకపోతే హైకోర్టు ఉండి ప్రయోజనం ఏముందని వ్యాఖ్యానించింది. ఇలాంటి అధికారుల నిర్లక్ష్య తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గుత్తేదారులు నష్టపోతున్నారని పేర్కొంది.
ఈ నెల 21కి విచారణ వాయిదా : ఒకానొక దశలో ఇరువురు అధికారులపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసేందుకు సిద్ధమైంది. వారెంట్ ఇవ్వొద్దని, హాజరు అయ్యేందుకు చివరి అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ పలుమార్లు అభ్యర్థించడంతో న్యాయమూర్తి శాంతించారు. విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ ఆ రోజు ఇరువురు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.