Covid Mock Drill in Vijayawada Government Hospital: 'అదొక ప్రభుత్వాసుపత్రి.. అందులో సమయానికి వైద్యులు ఉండరు. రోజవారీ సిబ్బంది ఉండరు. సరైన సౌకర్యాలు ఉండవు. రోగానికి ఖచ్చితమైన మందులు కూడా ఉండవు. ప్రభుత్వం ఆదేశించినప్పుడల్లా ఆసుపత్రికి ఉన్నతాధికారులు వస్తారు.. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తీరుస్తామంటూ ప్రకటనలు చేస్తారే తప్ప.. సమస్యలను పరిష్కరించనే పరిష్కరించరు' అంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్య సమస్యలతో విచ్చేసిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సమస్యలను పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆసుపత్రిలో అధికారులు నిర్వహించిన కొవిడ్ మాక్‌డ్రిల్‌పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.
అంతా బాగానే ఉందంటూ ప్రకటనలు: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగులకు వైద్య సేవలు అందించేందుకే.. రోజవారీ సిబ్బంది, సౌకర్యాలు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులు రావడం రోగులతో మాట్లాడి, హడావుడి చేసి వెళ్లడం తప్ప.. ఆసుపత్రిలో ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలను పరిష్కరించే పరిస్థితి మాత్రం లేదు. కానీ, అంతా బాగానే ఉందంటూ, మేం ఎలాంటి పరిస్థితులనైనా కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
తూతూ మంత్రంగా కొవిడి మాక్‌డ్రిల్: దేశవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో కొవిడ్ సన్నద్ధత కోసం మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కనీసం మాక్‌డ్రిల్ కూడా సరిగా నిర్వహించలేక అధికారులు చేతులెత్తేశారు. ఒకేసారి పరిస్థితి చేయిదాటి రోగుల తాకిడి పెరిగినప్పుడే ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను బట్టి మాక్‌డ్రిల్ చేపడతారు. కానీ, విజయవాడ ఆసుపత్రిలో కేవలం పది మంచాలను వేసి.. వాటిని సందర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ఇదే మాక్‌డ్రిల్ అంటూ సోమవారం సరిపెట్టేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల కిందట కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ మాక్‌డ్రిల్ నిర్వహించారు. అదే సమయంలో ఆక్సిజన్‌ను మంచాలకు సరఫరా చేసే వ్యవస్థ కూడా సరిగా లేదనే విషయం కూడా తెలిసింది. కానీ, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఈసారి కనీసం ఆక్సిజన్ పరిస్థితి ఏంటనేది కూడా పరిశీలించకుండానే అధికారులు మాక్‌డ్రిల్‌ను ముగించారు.