Five Working Days Per Week Extende For Employees For One Year : రాజధాని పరిధిలో పని చేసే ఏపీ సచివాలయం ఉద్యోగులు, హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27 తేదీ నుంచి మరో ఏడాది పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో పని చేసే రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ఈ వెసులుబాటు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పని వేళల నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లు, హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం :ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ నెలా మూడో శుక్రవారం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టరు, హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలిచ్చింది. ఉద్యోగుల వ్యక్తిగత ఫిర్యాదులును ఐడీ సహా 'జగనన్నకు చెబుదాం' పోర్టల్‌లో నమోదు చేయాలనీ సూచనలు జారీ చేసింది. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. నిర్దేశిత గడువు లోగా వాటిని పరిష్కరించేలా చూడాలని పేర్కొంది.
సీఎం జగన్‌ను కలిసిన అసిస్టెంట్ కలెక్టర్ల బృందం : 2022 ఏడాదికు చెందిన శిక్షణలో ఉన్న ఏపీ క్యాడర్ అసిస్టెంట్ కలెక్టర్ల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన 10 మంది ఐఏఎస్ ప్రొబేషనర్స్గా ఉన్న అసిస్టెంట్ కలెక్టర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పని చేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకు సాగాలని సీఎం జగన్ వారికి దిశా నిర్ధేశం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమీషనర్ :చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమీషనర్ షెల్లీ సాలెహీన్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగినట్టు సీఎస్ కార్యాలయం తెలియచేసింది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్‌కు తెలిపారు. మరో వైపు బంగ్లాదేశ్ జాతీయులకు సంబధించిన అంశాలపై ఆ దేశ డిప్యూటీ హై కమిషనర్ షెల్లీ సాలెహీన్ చర్చించినట్టు తెలుస్తోంది.