Heavy penalty on Single Use Plastic in AP: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెనాల్టీలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్దాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించేవారే వ్యయాన్ని భరించాలన్న సూత్రం ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానా వేసేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి , విక్రయాలపైనా, ఈ కామర్స్ కంపెనీలపైనా దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ వినియోగం, వ్యర్దాలపై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా 50 వేల రూపాయలు, రెండోమారు 1 లక్ష జరిమానా విధించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో 25 నుంచి 50 వేలు జరిమానాతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాయల చొప్పున పెనాల్టీ విధించాలని నిర్ణయించారు.