AP JAC Chairman Bopparaju Venkateswarlu: సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు విజయవాడలోని రెవెన్యూ భవన్లో సమావేశమైన ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గం.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఏపీజేఎసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన కార్యక్రమాల వివరాలను ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఎపీజేఎసీ అమరావతి నుంచి సీఎస్‌కు 50పేజీల వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను చులకనగా చూస్తోందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్పరాజు అన్నారు. మా సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారని మండిపడ్డారు.
సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని ఆరోపించారు. గతంలో ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కరించాలని సీఎంను కోరినట్లు బొప్పరాజు తెలిపారు. మా సమస్యలపై మంత్రుల బృందం చర్చలన్నీ చాయ్-బిస్కట్ చర్చలే అయ్యాయని ఎద్దేవా చేశారు. ఆలస్యమైనా మాకు మేలు చేస్తారని ఇన్నాళ్లూ వేచి చూశామని.. ఇక మాకేమీ చేయరని తెలిసిందని.. అందుకే ఉద్యమంలోకి దిగుతున్నట్లు బొప్పరాజు వెల్లడించారు. తమ ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే కారణమని ఆయన వెల్లడించారు. ఆవేదనతోనే ఆందోళనకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. తమ ఆందోళన వల్ల సమస్యలు ఎదురైతే ప్రజలు ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని కోరుతున్నట్లు బొప్పరాజు వెల్లడించారు. ఉద్యోగులు చట్టబద్దంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని బొప్పరాజు విమర్శించారు.
ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ:
- మార్చి 9, 10న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు
- మార్చి 13, 14న కలెక్టరేట్లు, ఆర్‌డీవో కార్యాలయాల వద్ద ధర్నా
- మార్చి 13, 14న భోజన విరామవేళ ఆందోళన
- మార్చి 15, 17, 20న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు
- మార్చి 21 నుంచి వర్క్ టు రూల్, సెల్‌ఫోన్ డౌన్
- మార్చి 24న హెచ్‌వోడీ కార్యాలయాల వద్ద ధర్నాలు
- మార్చి 27న కరోనా మృతుల కుటుంబసభ్యులను కలుస్తాం
- ఏప్రిల్ 1న వివిధ అంశాలపై నిరసన
- ఏప్రిల్ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన, వినతిపత్రాలు
- ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం
20వ తేదీ దాటినా జీతాలు వేయడం లేదని... జీతాలు సరిగా ఇవ్వక ప్రభుత్వ ఉద్యోగులు చులకనగా తయారయ్యారని వెల్లడించారు. ఉద్యోగులపై ప్రజలు కూడా సానుభూతి చూపిస్తున్నారని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో భాగమే అని పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు సహకరించాలని కోరారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు చోటు లేదని ఆయన తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని గుర్తు చేశారు. సమస్యలపై పోరాటం ఎందుకు చేయడం లేదని మాపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు.
ఉద్యోగుల న్యాయబద్ధమైనవని ప్రజలకు వెల్లడించినట్లు పేర్కొన్నారు. జీతాలు, పింఛన్లు ఒకటో తేదీనే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులను చైతన్యపరిచి ఉద్యమానికి సిద్ధం చేయనున్నట్లు బొప్పరాజు తెలిపారు. సీఎం ఇచ్చిన హామీకే విలువ లేకుంటే.. ఎవరికి చెప్పుకోవాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే మేం ఉద్యమానికి దిగుతున్నట్లు తెలిపారు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అందరూ కలిసి గొంతెత్తితే మన డిమాండ్లు సాధించుకోవచ్చని బొప్పరాజు తెలిపారు.
ఇవీ చదవండి: