AP Electricity workers strike from August 10: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రివైజ్డ్ పే స్కేళ్లు, అలవెన్సులు, జీపీఎఫ్ వంటి అంశాలను పరిష్కరించకుండా ఆలస్యం చేస్తోందని.. ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ముందుగా ఈ నెల (జులై) 27వ తేదీన భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో నిరసనను ప్రారంభించి దశలవారీగా రిలే నిరాహార దీక్షలు చేయనున్నామని..ఉద్యమ కార్యచరణ వివరాలను నేతలు వెల్లడించారు.
జులై 27 నుంచి విద్యుత్ సిబ్బంది నిరసన.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ఉద్యమ కార్యచరణ నోటీసును సిద్దం చేసింది. సిద్దం చేసిన ఆ నోటీసును ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల ఎండీలకు, డిస్కంల సీఎండీలకు విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు అందించారు. అనంతరం ఈ నెల 27 తేదీ నుంచి ఆగస్టు 9 తేదీ వరకూ వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టనున్నామని తెలియజేస్తూ.. గురువారం నాడు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు నోటీసు అందజేశారు. ఈ నిరసనల్లో అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్, జోనల్, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది మొత్తం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యచరణ నోటీసు ప్రకారం.. జులై 27వ తేదీ నుంచి ఆగస్టు 9 తేదీ వరకూ వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేయనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 8వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధ దగ్గర మహాధర్నా నిర్వహించనున్నారు. 9వ తేదీన సెల్ డౌన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకపోతే.. ఆగస్టు 10వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
సమ్మెకు దిగడమే సమస్యలకు పరిష్కారం..విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు మాట్లాడుతూ..''గతంలో పలుమార్లు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో, మినిట్స్‌లో పేర్కొన్న అంశాలపై యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలతో (గురువారం) నిర్వహించాల్సిన సమావేశాన్ని కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాయిదా వేశారు. దీంతో ఉద్యోగుల పట్ల యాజమాన్య నిర్లక్ష్యం, తీరుపై నిరసనగా సమ్మెకు దిగడం తప్ప మరోక మార్గం లేదు. అందుకే విద్యుత్ సంస్థల పరిధిలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్, జోనల్, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది మొత్తం సమ్మెలో పాల్గొనేలా అన్ని సంఘాల నేతలు కలిసి కార్యాచరణ రూపొందించాం. సమ్మె కారణంగా పరిశ్రమలు, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఇప్పటికీ భావిస్తోంది.'' అని ఐకాస నేతలు పేర్కొన్నారు.
ఆగస్టు 10 నుంచి విద్యుత్ సిబ్బంది సమ్మె.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన