MINISTER BOTSA SATYANARAYANA COMMENTS: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ప్రారంభించారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. లయోల కళాశాలలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలోనే మొదటగా అమలు చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశేనని వ్యాఖ్యానించారు.
విద్య రంగంలో చేస్తున్న మార్పుల వల్ల తమపై కొన్ని విమర్శలు వస్తున్నాయని, అయినా కూడా ఆ విమర్శలను లెక్క చేయకుండా విద్యార్థులకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లుతున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయడంతో పాటు.. గెస్ట్ లెక్చరర్లను కూడా నియమిస్తామని ఆయన తెలిపారు. గతంలో ఢిల్లీలో విద్యా విధానం బాగుందని వార్త మాధ్యమాల్లో చూసే వాళ్లమని, నేడు ఏపీలో దిల్లీని మించిన విద్యను ప్రభుత్వం విద్యార్ధులకు అందిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎంత కష్టపడుతున్నారో విద్యార్థులు అర్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థుల మేలు కోసం మరే రాష్ట్రంలో లేని రీతిలో ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేదించడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా తోటి విద్యార్ధులను ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ విద్యార్ధి అయినా సీనియర్ విద్యార్ధులచే ఇబ్బందులకు గురైతే తక్షణమే ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు. ర్యాగింగ్‌ను రుపుమాపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని విద్యార్ధుల్లో చైతన్యం నింపుతున్నామన్నారు. కరపత్రాల ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం కల్పిస్తున్నామని వివరించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను తమకు వివరించారని, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
మరోవైపు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి కీలక మెమోను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారి వివరాలతో పాటు ఇంకా 5 ఏళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారి వివరాలను పంపాల్సిందిగా.. జిల్లా విద్యాధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు మెమో జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, లేదా ఇంకా 5 ఏళ్లు సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారి సర్వీసు రికార్డులను స్టేట్ ఆడిట్ కార్యాలయంతో పాటు అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి పంపించాల్సిందిగా మెమోలో పేర్కొంది. ఉపాధ్యాయుల సర్వీసు రికార్డు ఆధారంగా పెన్షన్ చెల్లింపుల కోసం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆయా సర్వీసు రికార్డులను పంపించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖకు సూచించింది.
ఇవీ చదవండి