ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్ 2023​ ఫలితాలు విడుదల.. అబ్బాయిలు అదరహో

AP EAPCET 2023 Results: ఏపీ ఈఏపీసెట్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో బాలురు అదరగొట్టారు. టాప్​ 10 ర్యాంకులు వాళ్లే సాధించారు.

AP EAPCET 2023 Results
AP EAPCET 2023 Results

By

Published : Jun 14, 2023, 12:30 PM IST

AP EAPCET 2023 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీసెట్​ 2023 ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్​ ప్రవేశాలకు 76.32శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 89.65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ EAPCETకి మొత్తం 3 లక్షల 38 వేల 739 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షకు 2లక్షల 24వేల 724మంది పరీక్ష రాయగా.. 1లక్షా 71వేల 514మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ విభాగానికి సంబంధించిన పరీక్షకు 90వేల 573 మంది హాజరు కాగా.. 81వేల 203 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు ఈఏపీసెట్​ అధికారిక వెబ్‌సైట్‌‌‌ నుంచి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అదరగొట్టిన అబ్బాయిలు: ఈఏపీసెట్ ఫలితాల్లో అబ్బాయిలు అదరగొట్టారు. ఇంజనీరింగ్​ విభాగంలో టాప్ 10 ర్యాంకులు బాలురే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్​ స్ట్రీమ్​లో నందిగామకు చెందిన ఉమేశ్‌ వరుణ్‌ ప్రథమ ర్యాంకు సాధించగా.., హైదరాబాద్​కు చెందిన అభివన్‌ చౌదరికి రెండో ర్యాంకు వచ్చింది. పిడుగురాళ్లకు చెందిన సాయిదుర్గారెడ్డి మూడో ర్యాంకు, తిరుపతికి చెందిన బాబు సుజన్‌రెడ్డి నాలుగో ర్యాంకు, రాజంపేటకు చెందిన వెంకట యుగేశ్‌ ఐదో ర్యాంకు పొందారు. అగ్రికల్చర్‌ విభాగంలో కాతేరుకు చెందిన సత్యరాజ జశ్వంత్‌ మొదటి స్థానం పొందగా..శ్రీకాకుళానికి చెందిన వరుణ్‌ చక్రవర్తిరెండో ర్యాంకు సాధించారు. సికింద్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్‌ మూడో ర్యాంకు, చిత్తూరుకు చెందిన సాయి అభినవ్‌ నాలుగో ర్యాంకు, తెనాలి కి చెందిన కార్తికేయరెడ్డి ఐదో ర్యాంకు సాదించారు. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

"ఇంజనీరింగ్​ అండ్​ వ్యవసాయ కోర్సుల్లో బాలురు టాప్​ ర్యాంక్​ సాధించారు. ఇంజనీరింగ్​ విభాగంలో.. చల్లా ఉమేష్​ వరుణ్​ మొదటి ర్యాంకు సాధించాడు. 160కి 158మార్కులు పొందాడు. బిక్కా అభినవ్​ చౌదరి రెండో ర్యాంకు(160కి 157) సాధించాడు. మూడో ర్యాంకు నందిపాటి సాయి దుర్గారెడ్డి(160కి 155). నాలుగో ర్యాంకు చింతపాటి బాబు సుజనారెడ్డి(160కి 155). ఐదో ర్యాంకు దుగ్గినేని వెంకట యోగేష్​. ఇంజనీరింగ్​ విభాగంలో అబ్బాయిలే టాప్​ పది ర్యాంకులు సాధించారు"-బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

ఈఏపీసెట్​ 2023ను జేఎన్​టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీ ఈఏపీసెట్.. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఎంట్రన్స్​ కోసం మే 15 నుంచి నాలుగురోజుల పాటు అంటే 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వ‌హించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ఎంట్రన్స్​కు మే 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details