Congress leader Tulsi Reddy on Global Investors Summit: విశాఖ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్రానికి రూ.13లక్షల కోట్లకు పెగా పెట్టుబడులు వచ్చాయన్న ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువతను మళ్లీ మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయా పరిశ్రమల అధినేతలతో సీఎం ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకే పరిశ్రమలు వస్తున్నట్లు ఉదరగొడుతున్నారని తులసిరెడ్డి విమర్శించారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా జగన్ ఎందుకు కృషి చేయలేదని తులసిరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని వెల్లడించారు.
'జగన్ మళ్లీ నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 సూత్రాలు అమలు చేస్తాం. రైతులకు ఆరు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తాం. గృహిణులను దృష్టిలో పెట్టుకోని రూ. 500కే వంట గ్యాస్ సరఫరా చేస్తాం. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి నెలకు రూ. 6వేలు ఇస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. విభజన హామీలను అమలు చేస్తాం'-. తులసిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి