ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలి: సీఎం జగన్​ - Review of Button Reddy Education Department

Jagan Review on Education : విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులలో ఏవైనా సమస్యలు వస్తే వారం రోజుల్లో బాగు చేయాలని.. లేకుంటే కొత్త ట్యాబు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. గోరుముద్ద, నాడు-నేడు, విద్యాకానుక, 2023 సంవత్సర విద్యావిధానంపై చర్చించారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 9:28 PM IST

Jagan Review on Education : పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి సీఎం జగన్​ సమీక్షించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్యాబుల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు.. వాటి నిర్వహణకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో బాగు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబుల వాడకం, సహా పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. డేటా అనలిటిక్స్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్‌ మాస్టర్‌, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాజీ వద్దు: తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్నారు. డిజిటల్‌ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్నారు. వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. పిల్లల అందరి వద్ద డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్నారు. లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలని సూచించారు.

విద్యా కానుక: వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలన్నారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

రాగిమాల్ట్​: గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలన్న సీఎం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దన్నారు. ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

నాడు-నేడు: నాడు – నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. నాడు–నేడు రెండో దశ పనులనూ సమీక్షించారు. 22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details