CM JAGAN REVIEW ON HIGHER EDUCATION AND RECRUITMENTS: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు పచ్చజెండా ఊపారు. ఆయా యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న 3వేల 295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 2 వేల 635 పోస్టులతోపాటు, ట్రిపుల్ ఐటీల్లో మరో 660 పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపారు. ఈ ఖాళీలకు సంబంధించి.. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్రంలో ఉన్న వర్సిటీలు, ట్రిపుల్ ఐటీలపై ముఖ్యమంత్రి జగన్.. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 3,295 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేశారు. ఈ ఏడాది నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను నిర్దేశించారు. అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పూర్తిస్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
వర్సిటీలు ఉత్తమ ఫలితాలు సాధించాలి.. ముఖ్యమంత్రి జగన్ అధికారులతో మాట్లాడుతూ..''ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 51వేల పోస్టుల భర్తీ చేశాం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లోనూ పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిందే. యూనివర్సిటీలు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే.. పూర్తి స్ధాయిలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాల్సిందే. యూనివర్సిటీల్లో మొత్తం 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి ,ట్రిపుల్ ఐటీలలో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కలిపి మరో 660 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేస్తున్నాం. మొత్తం 3, 295 పోస్టులను ఈ ఏడాది నవంబర్ 15నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయండి.'' అని వ్యాఖ్యానించారు.
నిర్దేశించిన ప్రమాణాలతో కచ్చితంగా క్వాలిఫై కావాలి.. అనంతరం వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు కచ్చితంగా క్వాలిఫై కావాలన్న సీఎం.. నూటికి నూరుశాతం మెరిట్ ఉండాలన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇంటర్వ్యూ సమయంలో వెయిటేజ్ ఇవ్వాలని సూచించారు. వర్సిటీల్లో విద్యాను అభ్యసించే విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలన్నారు. కాబట్టి వర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఆగష్టు 23న 3,295 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..ఈ క్రమంలో వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలను అందించారు. ఖాళీ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది ఆగష్టు 23న వర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి.. అక్టోబరు 10కల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. రాత పరీక్ష ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలకు తేదీలు నిర్ణయించి.. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను ఆయా వర్సిటీలకు వెల్లడిస్తామని అధికారులు వివరించారు.