AP CM REVIEW ON PANCHAYATHIRAJ AND RURAL DEVELOPMENT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై అధికారులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో.. స్వయం సహాయక సంఘాల గురించి, ఉపాధి హామీ పథకం గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నాణ్యత గురించి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కనీసం ఐదేళ్లపాటు నాణ్యత ఉండాలి.. ముందుగా స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు మంచి మార్కెట్ వ్యవస్ధ కల్పించేందుకు బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి గత ఏడాది పెండింగ్ నిధులను కేంద్రం నుంచి తెప్పించుకునే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నాణ్యతపై దృష్టి పెట్టాలన్న సీఎం.. రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలని సూచించారు.
నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తాం.. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆయా శాఖల్లో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ప్రగతిపై చర్చించారు. మహిళల స్వయం సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్న ముఖ్యమంత్రి.. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. అనంతరం చేయూత కింద అర్హత సాధించిన ప్రతి లబ్ధిదారునికి నాలుగేళ్లపాటు వరుసగా క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయమనేది అందుతుందని వెల్లడించారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు.