AP Chief Electoral Officer Mukesh Kumar Meena on Deletes Voters Names: గత కొంత కాలంగా ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులు, మార్పులు చేర్పుల అంశంపై అధికార వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ, జనసేనతో పాటు పలు పార్టీలు ఆరోణలు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదులు చేశారు. ఇదే అంశంపై దాదాపు సంవత్సరం పాటు పోరాడారు. ఆయన పోరాట ఫలితమే అక్రమాలకు సహకరించిన అనంత జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి, గతంలో జడ్పీ సీఈఓగా పని చేసిన శోభా స్వరూపా రాణిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా... రాష్ట్రంలో ఓట్ల తొలగింపూ.. ఓట్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంనిర్వహించారు.
2022 జనవరి నుంచి ఓటర్ల జాబితాలోని అన్ని తొలగింపులపై పునఃపరిశీలన చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. 2022 జనవరి 6 తేదీ నుంచి ఇప్పటి వరకూ ఓటర్ల జాబితాలోని అన్ని తొలగింపులపై తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని స్పష్టం చేశారు. ఈ నెల 2-3 తేదీల్లో విశాఖలో జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమావేశంలో ఈ అంశంపై సీఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఓటర్ల జాబితాను పటిష్టంగా రూపొందించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచనలు చేశారని తెలిపారు. ఓటర్ల బదిలీలు, మృతుల తొలగింపు, షిఫ్టింగ్, మార్పు చేర్పుల అంశాలను పునః పరిశీలన చేస్తున్నట్టు వివరించారు. అన్ని కేటగిరీల కిందా జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తేలుస్తామని వెల్లడించారు. పునః పరిశీలన కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 9 తేదీనే అన్ని జిల్లాల కలెక్టర్లకూ మెమో జారీ చేసినట్టు వివరించారు.