Lingamaneni Ramesh house foreclosure case updates: ఇంటి జప్తు వ్యవహారంలో విజయవాడ అనిశా కోర్టు.. వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ.. వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఇటీవలే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
అవినీతి జరిగిందంటూ సీఐడీ కేసులు నమోదు.. గతేడాది మే నెలలో రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్పు చేయడంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది మే 12వ తేదీన సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు ఇస్తున్నామని పేర్కొంది. దీంతో లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ అనిశా కోర్టులో రెండు వేర్వేరు దరఖాస్తులు దాఖలాలు చేశారు. ఆ దాఖలాలపై పలుమార్లు విచారణ జరిపిన అనిశా కోర్టు.. తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.
ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరంలేదు.. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ తాజాగా క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్- 1944 నిబంధన మేరకు కోర్టు నుంచి అనుమతి కోసం సీఐడీ.. విజయవాడ అనిశా కోర్టులో మరో దరఖాస్తు చేసింది. దానిపై ఈ నెల 2న అనిశా కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 నిబంధన ప్రకారం ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి, వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. దీంతో లింగమనేని తరఫు ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇన్‌ఛార్జి కోర్టు మే 18న తమకు నోటీసులు జారీ చేసిందని, జప్తు పిటిషన్‌పై వాదనలు చెప్పుకొనే అవకాశం కల్పించాలని కోరారు.
లింగమనేని పిటిషన్ కొట్టివేత.. అనంతరం తమకు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ లింగమనేని తరపు న్యాయవాది అనిశా కోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనిశా కోర్టు.. ఈనెల 6వ తేదీన కొట్టివేసింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. లింగమనేని హైకోర్టులో అప్పీల్ వేశారు. అనిశా కోర్టు ఉత్తర్వులు రద్దు చేసి.. తమకు వాదనలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలని ఆ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. వాదనలు వినిపించేందుకు అవకాశమిస్తే తప్పేముందని సీఐడీని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఏపీ సీఐడీపై విమర్శల వెల్లువ..మరోవైపు గతకొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటిని జప్తు చేసే విషయంలో సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. సీఐడీ తన నిబంధనలను అతిక్రమించి.. అధికార పార్టీ నాయకుల చేతుల్లో బందీ అయ్యిందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థానాల తీర్పులను గౌరవించకుండా అధికార పార్టీ నిబంధలను సీఐడీ అధికారులు అనుసరిస్తున్నారని దుయ్యబడుతున్నారు.