ఆదాయానికి మించి ఆస్తులు.. రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు Anti Corruption Bureau Raids in Andhra Pradesh: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జాయింట్ సెక్రటరీ కేడివీఎం ప్రసాద్ బాబు ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రసాద్ బాబు 1991లో హైదరాబాద్‌లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా, ఎస్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా, ఎస్సై, సీఐగా పదోన్నతి పొందారని ఏసీబీ అధికారులు తెలిపారు. 2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ -అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఏటీవోగా చేరినట్లు వివరించారు. గతంలో తెలంగాణలోని భువనగిరి జిల్లా ఏటీవోగా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని తెలిపారు.
ACB Raids in Kaikaluru: ఏలూరు జిల్లా కైకలూరు మండలం గుమ్మళ్లపాడులో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కురెళ్ల బేబీ బంధువు రూబెన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. కాగా.. విజయవాడ, ఏలూరు, కైకలూరులో పలుచోట్ల ఏకకాలంలో అనిశా అధికారులు సోదాలు జరిపారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల ఎస్సై కడలి దీపిక.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భార్య భర్తల కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నుంచి నిందితుల పేర్లు తొలగిస్తానని ఆమె లంచం డిమాండ్ చేశారు. కాట్రగుంట గ్రామానికి చెందిన కేశవులు అనే వ్యక్తి నగదు ఇచ్చుకోలేక అనిశా అధికారులను ఆశ్రయించాడు. దీంతో స్టేషన్లో లంచం తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైతో పాటు కానిస్టేబుల్ నరసింహారావు కూడా పట్టుబడ్డాడు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి: గుంటూరులోని జీఎస్టీ అసిస్టెంటు కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నాగప్రసాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తమిళనాడుకు చెందిన సుందర్ రాజన్ అనే వ్యక్తి గుంటూరులో ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దానికి అనుమతి ఇచ్చేందుకు నాగ ప్రసాద్ 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. 15 వేల రూపాయలు చెల్లించిన సుందర్ రాజన్.. మిగతా సొమ్మును ఆ అధికారికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన అనిశా అధికారులు.. నాగ ప్రసాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టకున్నారు.