ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరిస్తారా.. ఉద్యమం ఉద్ధృతం చేయాలా..?: అంగన్‌వాడీలు

Anganwadis fire on AP government: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ వర్కర్ల బతుకులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయని.. టీచర్లు, ఆశా వర్కర్లు ఆవేదన చెందుతున్నారు. చాలీచాలని జీతాలతో అటు కుటుంబాన్ని, ఇటు అంగన్‌వాడీ కేంద్రాన్ని నడపలేక నానా అవస్థలు పడుతున్నామని.. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపడితే..పోలీసుల చేత అరెస్టులు చేయించి భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ జీతాలను, సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Anganwadis
Anganwadis

By

Published : Mar 22, 2023, 7:21 PM IST

Updated : Mar 23, 2023, 6:27 AM IST

Anganwadis fire on AP government: అరకొర జీతాలతో ఇటు అంగన్‌వాడీ కేంద్రాలను, అటు కుటుంబాలను నడపలేక నానా అవస్థలు పడుతున్నామని అంగన్‌వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి.. తమ జీతాలను పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని ధర్నాలు, ఆందోళనలు చేపడితే.. పోలీసుల చేత అరెస్టులు చేయించి.. భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యలను తీర్చకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్లు హెచ్చరిస్తున్నారు. 'మా సమస్యలను పరిష్కరిస్తారా? లేక ఉద్యమాన్ని ఉద్ధృతం చేయమంటారా?' అనే నినాదంతో ముందుకు సాగుతామని తేల్చి చెప్తున్నారు.

అంగన్‌వాడీల కష్టాలు-పట్టించుకోని అధికారులు: ''చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం అందించే అంగన్‌వాడీలు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మేం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్.. ఇప్పుడు మా గోడునే వినట్లేదు. మా సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితే.. మా గొంతులను నొక్కేస్తున్నారు. చాలీచాలని వేతనం.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో నానా ఇబ్బందులు పడుతున్నాం.. పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు'' అని రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక సమస్యలతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

సకాలంలో జీతాలుపడవు- జీవనం గడవదు: ఇక, జీతాలు విషయానికొస్తే.. సకాలంలో జీతాలు పడక, పెట్టిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో.. వచ్చే అరకొర జీతాలతో ఓవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని, మరోవైపు కుటుంబాన్ని నడపలేక అలసిపోతున్నామని అంగన్‌వాడీ వర్కర్లు వాపోతున్నారు. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అర్జీలు పెట్టుకున్నా.. ఆకలి కేకలు వినిపించేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వం అణగదొక్కుతుందని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నా.. తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు.

అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్ల జీతాలు ఎంతంటే?: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,700 అంగన్‌వాడీ మెయిన్ కేంద్రాలున్నాయి. అందులో దాదాపు 6 వేల మినీ కేంద్రాలున్నాయి. ప్రధాన కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పని చేస్తారు. మినీ కేంద్రంలో హెల్పర్ మాత్రమే ఉంటారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 11,500, హెల్పర్‌కు రూ. 7వేల రూపాయల చొప్పున వేతనం ఇస్తున్నారు. కూరగాయలకు అయ్యే ఖర్చును ముందుగా వర్కర్ కొనుగోలు చేసి నెల గడిచిన తర్వాత బిల్లు పెడతారు. సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో నిర్వహణ భారంగా మారుతుందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున నూనె ఇచ్చి మూడు రకాల కూరలు చేయాలని అధికారులు చెబుతున్నారని.. ఆచరణలో మాత్రం కష్టమవుతోందని కన్నీరు పెడుతున్నారు. కాంట్రాక్టర్లు కొన్నిసార్లు సరైన గుడ్లు ఇవ్వటం లేదని.. దీంతో ఇబ్బందులు పడుతున్నారని అంగన్‌వాడీ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.

ఫోటోలు తీసి ఫోన్‌లో అప్‌లోడ్ చేయాలి: అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పని ఒత్తిడి పెంచుతుందని అంగన్​వాడీ వర్కర్లు ఆరోపించారు. కేంద్రం నిర్వహణతోపాటు ఎప్పటికప్పుడు ఫోటోలను తీసి ఫోన్‌లో అప్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ముఖ ఆధారిత యాప్ (ఫేస్ రికగ్నేషన్) లో హాజరు పొందుపరచాలని.. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ ఫోన్‌కు సరైన సిగ్నల్స్ అందకపోవటంతో వీటికి చాలా సమయం పడుతుందని తెలిపారు. దీంతో చిన్నారులకు యాక్టివిటీలు నేర్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా వేతనం ఇస్తానని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక మాత్రం తమను పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 13వేల రూపాయలకు పైగా వేతనం ఇస్తున్నారని.. అదేవిధంగా తమకు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం.. పథకాలను ఇవ్వట్లేదు:మరోవైపు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి.. ప్రభుత్వ పథకాలను ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రాయితీలు, లబ్ధి తమకు చేకూరట్లేదని వాపోతున్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే ఆస్తులు అమ్ముకుని చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని కన్నీరుమున్నీరవుతున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల కోసం ఆందోళన చేస్తే తప్ప.. వేతనం సకాలంలో రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని.. తమ సమస్యలు పరిష్కారం కోసం చలో విజయవాడకు పిలుపునిస్తే .. ఎక్కడికక్కడ ప్రభుత్వం తమను అణిచివేసేందుకు ప్రయత్నించిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మెహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నేరవేర్చి.. తమను, తమ కుటుంబాలను ఆదుకోకపోతే.. భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి ముందుకు తీసుకెళ్తామని అంగన్‌వాడీలు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 23, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details