Anganwadis Besieged Houses of MLAs and Ministers :అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, మంత్రుల నివాసాల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. నిరసనకారులతో బాలకృష్ణ ఫోన్లో మాట్లాడి మద్దతుగా ఉంటామని భరోసా కల్పించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయల్దేరిన అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.
అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలం - సమ్మె ఉద్ధృతం, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి!
వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఎమ్మెల్యే సుధ ఇంటి వద్ద వినతిపత్రాన్ని ఉంచి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కొండాపురంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు చుట్టుముట్టారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి నివాసం వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగించారు. డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఇళ్ల వద్ద నిరసన తెలిపారు. మంత్రి సురేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద గేటుకు వినతి పత్రం కట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.