Anganwadi Workers Agitation in AP : 'ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళలు కాదా? జగన్‌కు మేం ఓట్లు వేయలేదా' అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ధ్వజమెత్తారు. 'ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని మాటిచ్చారు. అక్కడి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు 13,500 రూపాయల వేతనం పెంచి రెండేళ్లవుతోంది. ఇక్కడ ఆ ఊసే లేదు. పైగా నాలుగు సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచి సంక్షేమ పథకాలన్నీ తీసేశారు. 200 రూపాయల యూనిట్ల విద్యుత్తు రాయితీని ఎత్తేసి ఎస్సీ, ఎస్టీ అంగన్‌వాడీ మహిళల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారు' అని వారు మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరిక : అంగన్‌వాడీల సమస్యల్ని పరిష్కరిస్తామని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి శాసనమండలిలో చెప్పారని, ఇంత వరకు అతీగతీ లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట 36 గంటల పాటు మహాధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ధర్నా మంగళవారం రాత్రి వరకు కొనసాగనుంది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యలపై చర్చించి పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తల, సహాయకుల సంఘం(సీఐటీయూ) డిమాండ్ చేసింది. లేకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, నిరవధిక ఆందోళనకు సిద్ధమవుతామని, అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.