Anganwadi Workers Agitation 24th Day: సీఎం జగన్ ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో అణచివేసేందుకు యత్నిస్తుందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాష్ట వ్యాప్తంగా జరిగిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, 24వ రోజూ దీక్షా శిబిరాలు, ప్రభుత్వం కార్యాలయాల వద్ద అంగన్వాడీలు వినూత్న నిరసనలతో హోరెత్తించారు. సీఎం జగన్ నిరంకుశత్వ పోకడను వదిలి, ఇప్పటికైనా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హెచ్చరించారు.
నోటీసులిచ్చి బెదిరించాలని చూస్తే జడిసేదే లేదు: అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాల్సిందే - అంగన్వాడీల న్యాయపోరాటం
నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన:డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 24వ రోజూ ఉద్ధృతంగా సాగింది. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలిపారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అంగన్వాడీలపైన పోలీసులతో దాడి చేయించిందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద సీఎం జగన్, మంత్రులకు వ్యతిరేకంగా అంగన్వాడీలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మైలవరంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుండి సెంట్రల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
'జగన్ మొండిగా వ్యవహరిస్తే మేం జగమొండిగా ఎదిరిస్తాం' - అంగన్వాడీల ఆందోళన ఉద్ధృతం
సీఎం జగన్ చరిత్రలో మిగిలిపోతారు జగన్ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందని అనంతపురం జిల్లా శింగనమల తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మెడకు ఉరితాళ్లు బిగించుకుని ఆందోళన చేశారు. సమస్యలను పరిష్కరించాలని 24 రోజులుగా సమ్మె చేస్తున్నా, పట్టించుకోని ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని, లేదా తమ డిమాండ్లను వెంటనే తీర్చేందుకు కృషి చేయాలని నినాదాలు చేశారు. కళ్యాణదుర్గం తహశీల్దారు కార్యాలయం ఎదుట ఎండు గడ్డి తింటూ నిరసన తెలిపారు. అనంతపురంలో సోదెమ్మ అలంకరణలో సోది చెబుతూ అంగన్వాడీ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపింది. విధులకు హాజరుకావాలని నోటీసులిచ్చి బెదిరించాలని చూస్తే, జడిసేది లేదని తేల్చి చెప్పారు.
శవాసనాలు వేసి ఆందోళన సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ లో అంగన్వాడీలు శవాసనాలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా సారవకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలపై ధర్నా చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను దగ్ధం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చిన్నారులు, అంగన్వాడీలు వినూత్న వేషధారణలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్వాడీ గుండె ఆగిపోయింది - నెల్లూరు జిల్లాలో గుండెపోటుతో వనమ్మ మృతి