ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GOVT TALKS WITH APSRTC UNIONS: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు..పట్టించుకోని ఉన్నతాధికారులు - Andhra Pradesh govt news

Govt talks with APSRTC Employees Unions: రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రోజు తమ కష్టాలు తీరుతాయని ఎంతో సంబరపడ్డామని.. పాత పింఛన్ వస్తుందని ఆశపడ్డామని.. రెండున్నరేళ్లు దాటినా సమస్యలు పరిష్కారంకాక సతమతమవుతున్నామని.. ప్రభుత్వానికి ఏకరువు పెట్టారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు నెరవేర్చాలని మొరపెట్టుకుంటున్నారు.

GOVT
GOVT

By

Published : Jun 24, 2023, 2:08 PM IST

విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు..పట్టించుకోని ఉన్నతాధికారులు

Govt talks with APSRTC Employees Unions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు తిప్పలు తప్పటం లేదు. తమ సమస్యలను పరిష్కరించండి మహోప్రభో అంటూ రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయక తప్పటం లేదు. ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూ.. తమ గోడును వినండి సారూ అంటూ మొరపెట్టుకోక తప్పటం లేదు. సమస్యలతో సతమతమవుతున్నాం.. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించండి అని వేడుకోక తప్పటంలేదు. రెండున్నరేళ్లక్రితం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎంతో సంబరపడ్డ ఆర్టీసీ సంఘాల నేతలు.. విలీనమై రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కారంకాక అష్టకష్టాలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండున్నరేళ్లైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదు.. రెండున్నరేళ్లక్రితం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కష్టాలు తీరుతాయని సంబరపడ్డారు.పాత పింఛన్ వస్తుందని ఆశపడ్డారు. కానీ, రెండున్నరేళ్లు దాటినా సమస్య పరిష్కారం కాలేదు. విలీనంతో ఉన్నవి కాస్తా ఊడాయి. కొత్తవేమీ రాలేదు. ఇలా కష్టనష్టాలతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి ఏకరువు పెట్టారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని మొరపెట్టుకున్నారు. ఓపీఎస్ (O.P.S.) అమలు చేయండి.. పీఆర్సీ (P.R.C.) బకాయిలు ఇవ్వండి.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించండి. పూర్తి స్థాయిలో కారుణ్య నియామకాలు చేపట్టండి అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఏకరవు పెట్టిన సమస్యలు. ప్రభుత్వంలో విలీనం అనంతరం సమస్యలు పరిష్కరించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది.

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వాధికారులు భేటీ..ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన సమావేశానికి ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమల రావు, ఏపీపీటీడీ (A.P.P.T.D.) కమిషనర్ పాల్గొన్నారు. విలీనమై రెండున్నరేళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని.. ఉద్యోగ సంఘాల నేతలు సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. 40 అంశాలతో కూడిన మెమోరాండం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కోరారు.

అలా చేస్తే బస్సులు ప్రమాదాలకు గురవుతాయి..అనంతరం గతేడాది సెప్టెంబరు నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసినా.. అంతకు ముందు 8 నెలలకు చెందిన బకాయిలు ఇవ్వలేదని ఉద్యోగ నేతలు గోడు వెల్లబోసుకున్నారు. ఈహెచ్‌ఎస్ (E.H.S.)తో ఇబ్బందులు పడుతున్నందున దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ఉన్న అపరిమిత ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని విన్నవించారు. మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులతో విధులు నిర్వహించడం వల్ల.. బస్సులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. దీంతో ఆర్టీసీ ఉద్యోగ నేతల వినతులపై స్పందించిన రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న.. ఆయా అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జులై 5న జరగనున్న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నాటికి వీటిపై వివరాలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఏం విధంగా స్పందిస్తారోనని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఆసక్తిగా ఎదురుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details