TDP chief leaders fired on AP CM Jagan: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై.. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు.. జీ.వీ.రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఎన్నిసార్లు టెండర్లు పిలిచారు..?, వినియోగదారులపై ఎంతెంత విద్యుత్ భారాన్ని మోపారు..?, అన్ని రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటర్‌పై తక్కువ ధరను నిర్ణయిస్తే, జగన్ మాత్రం ఎక్కువ ధరను నిర్ణయించారంటూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
టెండర్ల వివరాలను మూడు రోజుల్లో ప్రకటించాలి.. ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి మాట్లాడుతూ..స్మార్ట్ మీటర్లపేరుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 4వేల 800 కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధమైందని ఆరోపించారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్‌కు దోచిపెట్టడానికే ప్రజల్ని రాబందుల్లా పీక్కుతింటున్నారని జీవీ రెడ్డి మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగితే వివరాలు ఎందుకు బయటపెట్టరని నిలదీశారు. టెండర్ల వివరాలు మూడు రోజుల్లో ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, గృహవిద్యుత్ వినియోగదారుల నుంచి రూ. 9వేల కోట్లు కొట్టేయడానికి జగన్ అండ్ కో సిద్ధమైందన్న ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్కో స్మార్ట్ మీటర్ ధర రూ. 10వేలకు తక్కువగా నిర్ణయిస్తే.. జగన్ మాత్రం రూ. 37వేల ధర పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే చంద్రబాబు రావాల్సిందే.. 'మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉండాలంటే.. మళ్లీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రావాల్సిందే' అని.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. 2019 నుంచి ముఖ్యమంత్రి జగన్.. ప్రతి ఏటా ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సీఎం తన అనుచరుల కోసం లబ్ది చేకూర్చేందుకే వేల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో కట్టబెటుతున్నారని ఆరోపించారు.