State Investment and Promotion Board meeting in AP: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం పలు ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేశారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో 498 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇథనాల్ ఇంధన తయారీకి అవిశా ఫుడ్స్, ఫ్యూయెల్స్ కంపెనీ ముందుకు రాగా ఆ ప్రతిపాదనలను ఆమోదించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ.3,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు. వీటివల్ల ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు రానుండగా.. 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కోసం పెట్టిన ప్రతిపాదలను ఆమోదించారు. మొదటి విడతలో 55వేల కోట్లు, రెండో విడతలో 55వేల కోట్లు పెట్టుబడి చొప్పున మొత్తంగా 1 లక్ష 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తొలి దశలో 30 వేలమందికి, రెండో దశలో 31వేల మందికి ఉద్యోగాల చొప్పున మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రతిపాదనల్లో తెలిపారు. మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీకాళహస్తి, పుంగనూరులో రూ.1087 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్… ఫ్యాక్టరీలకు ఆమోద ముద్ర వేశారు.. ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు వస్తాయని, డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలను ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.