Vijayawada Central Constituency Residents Fire on ycp leaders: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన నాయకులు.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దొంగ ఓట్లను సృష్టిస్తూ, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై, దొంగ ఓట్ల తయారీపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాజాగా తొలగించిన ఓట్ల సంఖ్యను, దొంగ ఓట్ల వివరాలను వారు మీడియాకు వెల్లడించారు.
ఓటర్ల జాబితాను వారికి కావాల్సినట్లు మారుస్తున్నారు..దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధల ప్రకారం.. ఓటర్ల జాబితాను ప్రతి ఏటా సవరించడం ఒక ఆనవాయితీ. అయితే, వచ్చే ఏడాది రాష్ట్రం (ఏపీ)లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా భారీగా ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల చేర్పులు వంటివి చోటు చేసుకుంటున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నగరపాలక సంస్థలోని మొత్తం 21 డివిజన్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం.. 25 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి బొండా ఉమాపై గెలుపొందారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బొండా ఉమా గెలుస్తారనే ఉద్దేశంతో ఓటర్ల జాబితాను కావాల్సినట్లు మారుస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో కొంతమంది ప్రతిపక్ష నేతలు నియోజకవర్గం మొత్తం తిరిగి సర్వే చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.