AP govt not encouraging the purchase of electric vehicles: ఇ-మొబిలిటీ విధానంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 రాయితీని ఎత్తివేయటంతో.. ఎలక్ట్రిక్ వాహన తయారీదారులంతా ఆ భారాన్ని వినియోగదారుల నెత్తిపై మోపేశాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్ విధిస్తూ నిర్ణయం తీసేసుకుంది. దీంతో సరాసరి ఒక్కో ఎలక్ట్రిక్ వాహనంపైనా రూ. 40 వేల నుంచి రూ. లక్ష వరకూ భారం పడుతోంది. దీంతో ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు మందగించాయి.
ఏపీలో మందగించిన ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు.. ఇ-మొబిలిటీ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిరుత్సాహ పరిచే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చే ఫేమ్ 2 సబ్సీడీని కేంద్రం ఎత్తివేస్తే.. ఈ మొబిలిటీ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను రాష్ట్రాలు మళ్లీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వాల నిర్ణయాల మేరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఆ భారాన్ని యథావిధిగా కొనుగోలు దారుపై మోపేస్తున్నాయి. దీంతో ఒక్కో ద్విచక్రవాహనంపై రూ. 20 నుంచి రూ. 30 వేల మేర, కార్లు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై రూ. 50 నుంచి రూ. 1 లక్ష మేర అదనపు భారం పడుతోంది.
ఫేమ్ 2 సబ్సీడీని ఎత్తివేసిన కేంద్రం..ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అమాంతం పెరిగిపోయి కోనుగోలుదారుడ్ని నిరుత్సాహ పరుస్తున్నాయి. దీంతో ఈ ఒక్క నెలలోనే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 175 రకాల ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సీడీని ఎత్తివేయటంతో ఓలా, ఆథర్, ఆరా, హీరో, మోరిసన్ గారేజ్, టాటా మోటార్స్, హుండాయ్ లాంటి వాహన తయారీ సంస్థలు వాహనాలపై ధరల్ని పెంచేశాయి. దీంతో మళ్లీ కొనుగోలు దారులు పెట్రోలు వాహనాల వైపు మొగ్గు చూపక తప్పటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 6.44 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు జరిగినట్టు కేంద్రం చెబుతోంది. అలాగే, రూ.3,113 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను కూడా ఫేమ్ 2 సబ్సీడి కింద ఇచ్చినట్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పష్టం చేస్తోంది.