AP JAC Amaravati Leaders Meet with CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఏపీ జేఏసీ, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని.. కేబినెట్ నిర్ణయాలపై, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని సీఎం జగన్‌కు తెలిపారు. అనంతరం సీఎంకు పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువతో సత్కరించారు.
47 అంశాలు రాసిస్తే.. 36 అంశాలను పరిష్కరిస్తామన్నారు..ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్బొప్పరాజు వెంకటేశ్వర్లుమీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జీపీఎస్ అనేది దేశానికి రోల్ మోడల్ అవుతుందని, ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీ జేఏసీ మద్దతును ప్రకటిస్తుందని బొప్పరాజు వ్యాఖ్యానించారు. పాత పింఛన్ విధానానికి 80శాతం దగ్గరగా జీపీఎస్ తీసుకురావటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏపీ జేఏసీ సంఘం తరుపున 47 అంశాలు పరిష్కరించాలని సీఎస్‌కు లేఖ ఇస్తే.. 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి ఏపీజేఎసీ అమరావతి నేతలు ధన్యవాదాలు తెలియజేశామన్నారు. ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించడంతో పాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.