శాప్‌లో రచ్చకెక్కిన వివాదాలు.. ఎండీపై బోర్డు సభ్యుల ఆగ్రహం AP Sports Authority Controversies viral: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో వివాదాలు రచ్చకెక్కాయి. మేనేజింగ్ డైరెక్టర్‌పై బోర్డు సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో 81వ పాలక మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. నలుగురు బోర్డు సభ్యులు మీడియా ముందుకొచ్చి శాప్ ఎండీ తీరుపై తీవ్రంగా విమర్శలు చేశారు.
రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఎండీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దుర్వినియోగం అయ్యాయని, క్రీడాకారుల కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అర్హత లేకపోయినా గ్రూపు-1 ఉద్యోగాలు ఇప్పించారని మండిపడ్డారు. సీఎం కప్ నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదని.. క్రీడాకారులకు ఒక్క జెర్సీ కూడా ఇవ్వలేని స్థితిలో శాప్ ఎండీ నేతృత్వంలో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా ఇవ్వడం లేదని ఆగ్రహించారు.
అనంతరం రూ.65 లక్షలకు టెండర్ వేస్తే అందులో పది రెట్లు అధికంగా ధరలు కోట్ చేశారని.. 150 హాకీ స్టిక్స్‌ను రూ.750 చొప్పున ఇచ్చేలా కొటేషన్ వస్తే.. దాన్ని కాదని ఒక్కోక్కటి రూ.10,020కి బిల్లు పెట్టారన్నారు. క్రీడా మైదానాలను అభివృద్ధి చేయరు.. క్రీడలను ప్రోత్సహించరు.. శాప్ సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వరంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాము ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా, ఏం అడిగినా డబ్బులు లేవంటూ ఎండీ ప్రభాకర్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారన్నారు.
చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి అడిగినా కూడా ఎండీ స్పందించడం లేదని.. సభ్యులుగా తాము సమావేశాల్లో గట్టిగా నిలదీస్తే ఆయన సమావేశం నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నారు. సంస్థలో జరుగుతున్న అవకతవలపై అనేకమార్లు బోర్డు సమావేశాల్లోనూ ప్రస్తావించామన్నారు. ఎండీ ఏకపక్ష నిర్ణయాల కారణంగా క్రీడాకారులు నష్టపోతున్నారని.. అందుకే తాము ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చామని బోర్డు సభ్యులు డానియల్ ప్రదీప్, నరసింహులు, వరలక్ష్మి, భీమిరెడ్డి నరేంద్ర తెలిపారు.
తమకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఎదుర్కొంటామన్నారు. ఎండీ అవినీతిపై అన్ని ఆధారాలు సేకరించాకే తాము బయటకొచ్చి మాట్లాడుతున్నామన్నారు. శాప్ సభ్యులుగా తమ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చలేకపోతున్నామని వాపోయారు. క్రీడాకారులకు ఏ సామగ్రి ఇవ్వలేక.. సిగ్గుపడుతున్నామన్నారు. మధ్యాహ్నం వరకు బోర్డు సమావేశాలు జరిపినా సభ్యులకు భోజనాలు పెట్టడం లేదని, చివరికి గుర్తింపు కార్డు కూడా ఎండీ ఇవ్వడం లేదని వెల్లడించారు.
నేను రాజీనామా చేస్తే..: మీడియాతో మాట్లాడిన తర్వాత.. బోర్డు సమావేశానికి హాజరైన నలుగురు సభ్యుల్ని ఛైర్మన్‌తో పాటు ఇతర సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాల్సిన అంశాలను ఎందుకు రచ్చకీడుస్తారంటూ ఛైర్మన్ సిద్ధార్ధ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఓ దశలో తాను రాజీనామా చేస్తే బోర్డు రద్దవుతుందంటూ.. ఎండీతో కలిసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కొద్దిసేపటి తర్వాత శాప్ సభ్యులు.. ఛైర్మన్, ఎండీలను సమావేశానికి వచ్చేలా ఒప్పించారు. మీడియా వద్ద సభ్యులు ప్రస్తావించిన అంశాలకు.. ఎండీ బదులిచ్చినట్లు తెలిసింది.
ఇవీ చదవండి