Jal Jeevan Mission : కేెంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జల్ జీవన్ మిషన్ - జేజేఎం కింద రాష్ట్రంలో 78వేల 366 పనులు పూర్తిచేసి గ్రామీణులకు మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 16 వేల 216 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు సమకూర్చాలని ఒప్పందం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా... రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15 వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేశారు. కానీ ప్రభుత్వ వాటా నిధులు సక్రమంగా విడుదల చేయనందున... గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదు. దీనివల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పలు జిల్లాల్లో పనులు ప్రారంభించినా.. అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంటోంది.
బాపట్ల జిల్లాలో తొలి విడత 205 కోట్ల 22 లక్షలతో 723 పనులు ప్రారంభించారు. ఇందులో ఇప్పటివరకు 189 పనులే పూర్తిచేశారు. గుంటూరు జిల్లాలో 98 కోట్లతో చేపట్టిన 308 పనుల్లో ఇప్పటికీ 50శాతం పూర్తికాలేదు. ఎన్టీఆర్ జిల్లాలో రెండు విడతల్లో మంజూరైన 12వందల 27 పనుల్లో 115 పూర్తయ్యాయి. 5కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నందున... మిగతా పనులు పూర్తి చేయడంపై గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. 4మండలాల్లో 46 పనులకు రెండుమూడు సార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. విజయనగరం జిల్లాలో మంజూరైన 11 వందల 11 పనుల్లో 630 మాత్రమే పూర్తయ్యాయి.