Andhra Pradesh Mineral Development Corporation Road Show In All Over India : ఏపీలో చిన్న మొత్తంలో ఉన్న ఖనిజాల మైనింగ్ కోసం.. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ రోడ్ షోలను నిర్వహిస్తోంది. ఇప్పటికే, ఇలాంటి రోడ్ షోలను ఏపీ పరిశ్రమల శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. బెంగుళూరు, చెన్నై, ముంబాయిలలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ షోలను నిర్వహించింది. ఇదే కోవలో ఇప్పుడు ఏపీఎండీసీ కూడా రోడ్ షో లను నిర్వహించి, మైనింగ్ అభివృద్ది కోసం.. పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలని భావిస్తోంది. అందుకోసం బుధవారం చెన్నైలో ఓ రోడ్ షో నిర్వహించింది.
ఏపీలో ఉన్న అపారమైన ఖనిజాలను వెలికి తీసేందుకుగానూ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ.. బుధవారం చెన్నైలో నిర్వహించిన రోడ్ షో కు అధికారులు పెద్ద ఎత్తున హజరయ్యారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గనులపై ఇ - ఆక్షన్ నిర్వహిణపై, ఔత్సాహిక పెట్టుబడుదారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో విస్తృతంగా అందుబాటులో ఉన్న గ్రానైట్, క్వార్డ్జ్, సిలికా శాండ్, డోలమైట్, రోడ్ మెటల్, గ్రావెల్ తదితర చిన్న తరహా ఖనిజాల మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిని ఈ రోడ్ షోలకు ఆహ్వానిస్తున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) స్పష్టం చేసింది. ఫిక్కి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఈ రోడ్ షోకు 200 మంది ఔత్సాహికులు హాజరైనట్టు గనుల శాఖ తెలిపింది. ఈ తరహాలోనే మరో మూడు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించాలని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది.