AP High Court quashed the Lokayukta orders: ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చర్యలకు ఏపీ లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. లోకాయుక్త.. అలా వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలు, లోకాయుక్త చట్టంలో ఉన్న సెక్షన్ 10(1)(బి)ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అనంతరం లోకాయుక్త.. చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి తాజాగా ప్రక్రియను ప్రారంభించే స్వేచ్ఛను కూడా లోకాయుక్తకే వదిలేసింది. ఈ క్రమంలో మరోమారు విచారణ ప్రక్రియను ప్రారంభిస్తే గనుక.. విచారణాధికార పరిధి విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు లేవనెత్తవచ్చని ధర్మాసనం పేర్కొంది. తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే విచారణాధికార పరిధిని తేల్చాలని లోకాయుక్తకు స్పష్టం చేసింది.
వాదనలు చెప్పుకునే ఛాన్స్ లోకాయుక్త ఇవ్వలేదు.. తనపై సీఐడీకి ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త గతేడాది సెప్టెంబర్ 28న ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ.. తహశీల్దార్ బలరామ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అంతేకాదు, రెవెన్యూ రికార్డుల్లో ఫలానా వ్యక్తుల పేర్లు చేర్చాలంటూ లోకాయుక్త ఆదేశాలివ్వడాన్ని సవాలు చేస్తూ.. మరో వ్యాజ్యం కూడా దాఖలైంది. ఆ రెండు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. విచారణలో భాగంగా తాము వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంటూ దాఖలైన మొత్తం ఆరు వ్యాజ్యాలపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. దర్యాప్తు ప్రక్రియకు సంబంధించి లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 10 స్పష్టం చేస్తోందని ధర్మాసనం తెలిపింది.