AP High Court Fire on CID Officers: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) పలు కీలక ప్రశ్నలను సంధించింది. సీఐడీ అధికారులు చింతకాయల విజయ్‌కి జారీ చేసిన 41ఏ నోటీసును హైకోర్టు ఆక్షేపించింది. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలతో హాజరుకావాలంటూ ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. దస్త్రాల వివరాలు నిర్ధిష్టంగా తెలపకుండా అస్పష్టంగా నోటీసు ఎలా ఇస్తారని న్యాయస్థానం సీఐడీని నిలదీసింది. ఆ నోటీసు ఆధారంగా ఏప్రిల్ 24వ తేదీ వరకు విజయ్‌పై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి తేల్చి చెప్పింది. ఆ దస్త్రాలేంటో పిటిషనర్‌కు తెలియజేయాలని స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇంటి నిర్మాణ విషయంలో ఫోర్జరీ ఎన్‌వోసీ సృష్టించారనే ఆరోపణతో నమోదైన కేసులో.. అన్ని దస్త్రాలతో తమ ముందు ఈనెల 31న హాజరుకావాలని రాజమహేద్రవరం సీఐడీ సీఐ మార్చి 24న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చింతకాయల విజయ్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు. సీఐడీ అధికారులు జారీ చేసిన ఆ 41ఏ కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలతో తమ ముందు హాజరుకావాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆ నోటీసును సవాలు చేస్తూ చింతకాయల విజయ్ ఇటీవలే హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. దీంతో విజయ్ వేసిన వ్యాజంపై విచారించిన ధర్మాసనం.. సీఐడీ అధికారుల వ్యవహారంపై ఆగ్రహించింది.. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలతో తమ ముందు హాజరుకావాలంటూ ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. దస్త్రాల వివరాలను నిర్ధిష్టంగా పేర్కొనకుండా అస్పష్టంగా నోటీసు ఎలా ఇస్తారంది. ఆ నోటీసు ఆధారంగా ఏప్రిల్ 24 వరకు విజయ్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి తేల్చి చెప్పింది. ఆ దస్త్రాలేమిటో పిటిషనర్‌కు తెలియజేయాలంది. విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ తన వాదనలు వినిపిస్తూ.. ''కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను విచారణకు తీసుకురావాలని సీఐడీ నోటీసులో పేర్కొంది. కానీ, ఎటువంటి నిర్ధిష్ట వివరం మాత్రం పేర్కొనలేదు. దస్త్రాలను తీసుకురాలేదన్న కారణం చూపి.. విచారణకు హాజరైన పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.'' అని న్యాయవాది వ్యాఖ్యానించారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం విజయ్‌కు ఏ విధమైన రూల్స్ ప్రకారం నోటీసు ఇచ్చారంటూ సీఐడీ తరఫు న్యాయవాది శివకల్పన రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ నోటీసు ఆధారంగా పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇవీ చదవండి