Amul In AP : "అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో సంవత్సరంలో సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు.. లీటరుకు నాలుగు రూపాయల చొప్పున రాయితీ ఇస్తాం." మార్చి 24న రేపల్లెలో (ప్రస్తుతం బాపట్ల జిల్లా) సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలివి. "చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తాం. ఆ డెయిరీకి పాలు పోసిన ప్రతి పాడి రైతుకు బోనస్ లీటరుకు నాలుగు రూపాయల చొప్పున ఇస్తామని చెప్తున్నా." 2018 జనవరి 3న ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాలో ఉన్న పీలేరులో అన్న మాటలివి.
సహకార డెయిరీలను పునరుద్ధరించి, లీటర్ పాలకు 4 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు శపథం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక దానికి చాపచుట్టేసి అమూల్‌కు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సొంత బ్రాండ్ విజయ డెయిరీని పక్కనపెట్టి.. గుజరాత్ సహకార సంఘాలకు పెద్దపీట వేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూతపడిన డెయిరీలతో పాటు నడుస్తున్నవాటినీ మూయించి.. అమూల్‌కు అప్పగించేందుకు ప్రయాస పడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలితో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో డెయిరీ అనేదే ఉండదనిపిస్తోంది. అంతా అమూల్‌మయమే..! అప్పుల భారం, వాటిని చెల్లించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ దశాబ్దాల పాటు మోయాల్సి వస్తుంది. అమూల్ కోసం ఎంతైనా, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు, కట్టబెట్టేందుకు సై అంటున్న ముఖ్యమంత్రికి.. బోనస్ రూపంలో పాడి రైతులకు నెలకు 26 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదు. ఈ మూడున్నరేళ్లలో 11 వందల 8 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో ఏపీడీడీసీఎఫ్ పరిధిలోని డెయిరీలకు 3 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు అంచనా. సుమారు 700 ఎకరాల భూములు ఉండగా.. వాటి విలువే 15 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఒంగోలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం, కంకిపాడు, పులివెందుల, ఏలూరు జిల్లా కొత్తపల్లిలో డెయిరీలు ఉన్నాయి. మూతపడిన, ప్రస్తుతం పనిచేస్తున్న డెయిరీల్లో మొత్తం 141 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు, రెండు మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు, మదనపల్లిలో యూహెచ్‌టీ ప్లాంట్‌తోపాటు.. ఒంగోలులో 3 వేల టన్నుల సామర్థ్యంతో పాలపొడి ప్లాంట్ యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం గతంలో నిర్ణయించిన లీజు ధర 3.38 కోట్ల రూపాయలు మాత్రమే. ఏడాదికి 3 శాతం చొప్పున పెంచుతామని ప్రతిపాదించారు.
వైసీపీ ప్రభుత్వం సహకార డెయిరీల పునరుద్ధరణ అనే పదాన్నే మరిచిపోయింది. ఒక్క డెయిరీని కూడా నిర్వహణలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అన్నీఅమూల్‌కు కట్టబెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే మదనపల్లి యూహెచ్‌టీ ప్లాంట్‌ను అమూల్‌కు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత 15 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్‌లో యంత్రాలు ఏర్పాటుచేశారు. తాజాగా మూతపడిన చిత్తూరు డెయిరీని 99 ఏళ్ల లీజుకు ఇస్తూ డిసెంబర్ 13న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఒంగోలు డెయిరీతోపాటు మిగిలిన వాటినీ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్ సంస్థ వద్దనడంతోనే కొన్నింటిని పక్కనబెట్టింది. లేదంటే ఇప్పటికే అన్ని లీజులు పూర్తయ్యేవని అధికార వర్గాలే చెబుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అమూల్‌ను రాష్ట్రంలోకి ఆహ్వానించింది. వారికి కట్టబెట్టేందుకు ఏకంగా ఒంగోలు డెయిరీ మూసివేతకు కంకణం కట్టుకుంది. అప్పటి వరకు రోజుకు 50 వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా.. సేకరణ ఆపేయాలని ఆదేశించింది. పాడి రైతులకు బకాయిలతోపాటు, ఉద్యోగుల వీఆర్ఎస్కు సుమారు 80 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత అమూల్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే నిర్వహణ వ్యయం అధికమవుతుందనే ఆలోచనతో.. ఒంగోలు డెయిరీని తీసుకునేందుకు అమూల్ ముందుకు రాలేదు. దీనివల్ల డెయిరీలోని విలువైన ఆస్తులు నిరుపయోగంగా మారాయి.