AP CM JAGAN Meeting with Party Leaders News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లా పర్యటనను, అధికారిక సమీక్షలను రద్దు చేసుకుని.. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరుకానున్నారు. నిన్న (ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షల అనంతరం సీబీఐ కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 29వరకు రిమండ్ విధించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీకావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
CM JAGAN Meeting with Party Leaders: వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ.. అందుకేనా..?
12:14 April 17
అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్
వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర రాజకీయాల్లో గత మూడు రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడు పెంచింది. దీంతో గత మూడు రోజులక్రితం కడప ఎంపీ అనినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరుపర్చగా.. సీబీఐ కోర్టు జడ్జి ఉదయ్ కుమార్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. అనంతరం సీబీఐ అధికారులు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా వివేకా హత్య కేసులో కుట్రదారుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలతో సీబీఐ.. ఆదివారం రోజున ఆయనను పులివెందులలో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి.. సీబీఐ జడ్జి ముందు హాజరుపరిచింది. దీంతో భాస్కర్ రెడ్డికి 14 రోజులు (ఈనెల 29 వరకు) రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని సహ నిందితుడిగా చేర్చింది. సోమవారం రోజున మూడు గంటలకు హైదరాబాద్‌లో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరారు. అవినాష్ రెడ్డితో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసీపీ నేతలు కూడా బయల్దేరారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించనున్న క్రమంలో అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చలు జరపడం కీలక అంశంగా మారింది. సమావేశంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారా..? లేక ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించిన అంశం గురించి చర్చిస్తున్నారా..? అనే తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి