CM JAGAN MEET WITH MLAS ON GADAPA GADAPAKU MANA PRABHUTWAM: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం'పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతోపాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, ముఖ్య నేతలు హాజరు కాగా.. పలువురు ముఖ్యమైన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు?, కారణం ఏంటి? అనే తదితర అంశాలపై సందిగ్ధత నెలకొంది.
సమావేశానికి ముఖ్య నేతలు గైర్హాజర్:వివరాల్లోకి వెళ్తే.. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో నియోజకవర్గ సమన్వయ కర్తలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. అందులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంపై, భవిష్యత్ కార్యాచరణపై, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమాల గురించి నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సమావేశానికి పలువురు ముఖ్యమైన ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆరోగ్య కారణాలు - వ్యక్తిగత కారణాలు:సీఎం జగన్ తాడేపల్లిలో నిర్వహించిన సమావేశానికి.. మంత్రులు ధర్మాన కృష్ణ ప్రసాదరావు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైద్యాశాఖ మంత్రి విడదల రజినిలు హాజరు కాలేదు. వీరితోపాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, నవాజ్ బాషా, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, ఎమ్మెల్యే వంశీ, ఆళ్ళ నాని తదితరులు కూడా హాజరు కాలేదు. అందుక్కారణం ఆరోగ్య కారణాలతో పాటు, వ్యక్తిగత కారణాల కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోయారని ఆయా ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందించినట్లు సమాచారం.